కరోనా వైరస్ హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. వైరస్ కారణంగా ఆర్డర్లు బాగా తగ్గిపోవడంతో రెస్టారెంట్లు, హోటళ్లు లాభాలు లేక లబోదిబోమంటున్నాయి. ఇక ఫుడ్ డెలివరీ బాయ్‌ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆర్డర్లు తగ్గపోవడంతోపాటే వారి రోజువారి ఆదాయం కూడా అమాంతం పడిపోయింది. దీంతో తమకు రోజు గడవడం కష్టంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కారణంగా ఇప్పటికే పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలతోపాటు ఆన్‌లైన్ విధులు నిర్వహించడానికి వీలున్న అనేక సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పాటిస్తున్నాయి. దీంతో కార్యాలయాల ద్వారా ఫుడ్ డెలివరీ అవుట్‌లెట్‌లకు, హోటళ్లకు వచ్చే ఆర్డర్లు భారీగా పడిపోయాయి. దీనికి తోడు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్‌చేస్తే ఆ ఆహారాన్ని తయారుచేసే వంటవాడు మొదలు డెలివరీ బాయ్ వరకు ఎవరు పరిశుభ్రత పాటించుకున్నా కరోనా బారిన పడుతామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇండ్ల నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారు కూడా కరువయ్యారు.
ఈ పరిస్థితి ఫుడ్ డెలివరీ బాయ్‌లకు శాపంగా మారింది. ‘అందిరిలా మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు కదా.. మేమెలా బతకాలి? మా భార్య, బిడ్డలను ఎలా పోషించుకోవాలి?’ అని వారు బాధపడుతున్నారు. గతంలో తాము రోజుకు రూ.1000 నుంచి 1500 సంపాదించేవాళ్లమని.. ఇప్పుడు కరోనావల్ల రోజుకు రూ.500 నుంచి 600 రావడమే గగనమైందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.