మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత భయంకరంగా ఉంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. కొత్తగా మరో 82 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క ముంబైలోనే కొత్తగా 59 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2064కు చేరింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఎక్కువగా కరోనా కారణంగా మరణించారు.
కరోనా కట్టడికి ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు కరోనా వ్యాప్తిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రకు సరిహద్దులో ఉండే విజయపుర జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా వైరస్ సోకింది.